Ashok Gajapathi Raju: సంచయితకు తాత ఎవరో, తండ్రి ఎవరో కూడా తెలియదు: అశోక్ గజపతిరాజు
- ఒక్కో చోట ఒక్కో తండ్రి పేరు చెప్పుకునే పిల్లలను ఎక్కడా చూడలేదు
- ట్విట్టర్ పోస్టులే ఆమె వ్యక్తిత్వాన్ని చెపుతాయి
- తాత, తండ్రిని ఆమె ఎప్పుడూ చూడలేదు
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును తప్పించి... ఆయన స్థానంలో సంచయితను వైసీపీ ప్రభుత్వం నియమించినప్పటి నుంచి వివాదం రాజుకుంది. అప్పటి నుంచి గజపతిరాజుల కుటుంబంలో ప్రకంపనలు మొదలయ్యాయి.
తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్ పై అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. తన తల్లి, రెండో తండ్రితో కలిసి జరుపుకున్న దీపావళి వేడుకకు సంబంధించిన ఫొటోలను సంచయిత షేర్ చేశారు. మీకు మా కుటుంబం తరపున దీపావళి శుభాకాంక్షలు అని కామెంట్ పెట్టారు.
ఈ ట్వీట్ పై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, తండ్రులను మార్చేవారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ తండ్రి ఎవరనేది సోషల్ మీడియాలో మీరే పోస్ట్ చేశారని... ట్విట్టర్ లో మీరు పెట్టిన పోస్టులే మీ వ్యక్తిత్వాన్ని చెపుతాయని అన్నారు. ఒక్కో చోట ఒక్కో తండ్రి పేరు చెప్పుకునే పిల్లలను తాను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులకు తాను సమాధానాలు చెప్పాల్సి రావడం తన ఖర్మ అని అన్నారు. ఆమెకు తాత ఎవరో, తండ్రి ఎవరో కూడా తెలియదని... తండ్రి, తాతను ఆమె జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు.
తమ వంశీకులు నిర్వహించే ఆలయాలకు ఎప్పుడూ రానివారు... ఇప్పుడు వాటి ఆస్తులపై కన్నేశారని అశోక్ మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి అనేది ప్రభుత్వ పదవి కాదని అన్నారు. ట్రస్టు వ్యవహారాలలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. దేవాదాయ చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు.