Raghu Rama Krishna Raju: ఢిల్లీలో ఒక తండ్రి పేరు, ఏపీలో మరో తండ్రి పేరు చెప్పుకుంటున్నారు: సంచయితపై రఘురామకృష్ణరాజు విమర్శ
- ఏపీకి వచ్చినప్పుడు హిందువుగా ఉంటున్నారు
- ఢిల్లీలో క్రిస్టియన్ గా ఉంటున్నారు
- ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటే కోర్టులు అంగీకరించవు
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక తండ్రి పేరును, ఏపీకి వచ్చినప్పుడు మరొక తండ్రి పేరును సంచయిత చెప్పుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వచ్చినప్పుడు హిందువుగా ఉంటూ, ఢిల్లీలో క్రిస్టియన్ గా ఉంటున్నారని విమర్శించారు. హిందూ మతాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా ఆమె అనర్హురాలని అన్నారు.
విశాఖ శారదాపీఠం స్వరూపానందకు ఆలయ మర్యాదలను అందించాలంటూ తమ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఈరోజు ఏపీ హైకోర్టు కొట్టేసిందని రఘురాజు చెప్పారు. ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటే కోర్టులు అంగీకరించవని అన్నారు. సంచయిత విషయంలో కూడా కోర్టులు ఇలాంటి తీర్పునే ఇస్తాయని చెప్పారు. ఎవరి అండో చూసుకుని చెలరేగిపోతే కుదరదని... రేపో, మాపో కోర్టు ఆదేశాలు వస్తాయని అన్నారు.
కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా తమ వైసీపీ ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని రఘురాజు మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే ప్రజలు కూడా విసుక్కుంటారని అన్నారు. ఏపీలో అవినీతిని ప్రశ్నించే వారిపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.