queen elizabeth: బ్రిటన్ రాణికి ఫ్రాన్స్ రేడియో వెబ్సైట్ శ్రద్ధాంజలి.. విస్తుపోయిన జనం!
- వందమందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రకటన
- అందులో బతికి ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు
- తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణ
ఫ్రాన్స్‌కు చెందిన 'రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్' (ఆర్ఎఫ్ఐ) వెబ్సైట్ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు శ్రద్ధాంజలి ఘటించడం వివాదాస్పదమైంది. ఈ వెబ్సైట్ ఇటీవల వంద మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రకటన ఇచ్చింది.
అంతవరకు బాగానే ఉన్నా.. ఆ వందమందిలో బతికి ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో చూసిన వారు విస్తుపోయారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌తోపాటు ఫ్రెంచ్ నటి బ్రిగిట్టె బర్డాట్, బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పేలీ, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత రౌల్ కాస్ట్రో వంటి వారు ఉన్నారు. వీరంతా 80-90 ఏళ్ల వయసున్న వారే కావడం గమనార్హం.
ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించి ప్రకటనను తొలగించినప్పటికీ అప్పటికే అది అందరికీ చేరిపోయింది. దీంతో ఆర్ఎఫ్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా ప్రముఖుల అభిమానులు మండిపడ్డారు. స్పందించిన రేడియో సంస్థ జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలిపింది. సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది.