Yanamala: అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ వెనుకంజ వేస్తోంది: యనమల
- ఓటమి భయంతోనే వైసీపీ వెనుకంజ
- ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి
- కరోనా అంశాన్ని వైసీపీ సాకుగా చూపుతోంది
- తమకు వ్యతిరేకంగా ఓటేస్తారనే వైసీపీ భయం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివాదం రేగుతోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నికల నిర్వహణను వాయిదా వేసినందుకు మండిపడ్డ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్వహణపై తొందర వద్దని చెబుతుండడంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అడ్డురాని కరోనా అంశాన్ని వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు సాకుగా చూపిస్తోందని ఆయన నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినప్పుడు రాష్ట్ర యంత్రాంగాన్ని బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని ఆయన చెప్పారు. బాధిత వర్గాలన్నీ తమకు వ్యతిరేకంగా ఓటేస్తారనే వైసీపీ భయపడుతోందని యనమల చెప్పారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా సీఎస్ ఇందులో జోక్యం చేసుకుంటూ లేఖ రాయడం అనుచితమని యనమల విమర్శించారు. అలాగే, కొత్త జిల్లాల సాకుతో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని చూడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రకటన చేసిన విధంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాలని ఆయన అన్నారు.