WHO: కరోనా వ్యాక్సిన్ డోసులను పెద్ద మొత్తంలో బుక్ చేసుకున్న పలు దేశాలు.. డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరాలు
- వ్యాక్సిన్ సంస్థలపై ఒత్తిడి
- అధిక డోసులను అడ్వాన్సుగా బుకింగ్
- ప్రతి వ్యక్తికి ఐదేసి డోసులు బుక్ చేసుకున్న అమెరికా, బ్రిటన్
- కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరం
కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే విషయంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నట్లే వ్యాక్సిన్ వచ్చాక తమకే అధిక డోసులు అందాలన్న పోటీ కూడా ధనికదేశాల్లో కనపడుతోంది. వ్యాక్సిన్ అభివృద్ధి దశలో ఉన్న సమయంలోనే పలు ధనిక దేశాలు వ్యాక్సిన్ సంస్థలపై ఒత్తిడిని పెంచుతూ అధిక డోసులను అడ్వాన్సుగా బుక్ చేసుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్ దేశాలు తమ దేశంలోని ప్రతీ వ్యక్తికి ఐదేసి డోసుల చొప్పున ప్రీ బుకింగ్ చేయడం గమనార్హం.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనాం అభ్యంతరాలు తెలిపారు. ఇలా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీపడితే కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కాగా, అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ డోసులలోని 50 శాతాన్ని ఇప్పటికే ధనిక దేశాలు బుక్ చేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల కారణంగా వ్యాక్సిన్ ధరలు భారీగా పెరిగి మిగిలిన దేశాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
అమెరికా ఇప్పటికే అడ్వాన్సుగా 2,400 మిలియన్ల డోసులను, ఐరోపా సమాఖ్య దేశాలు 2,065 మిలియన్ల డోసులను బుక్ చేసుకున్నాయి. పలు దేశాలు కూడా అదే స్థాయిలో వ్యాక్సిన్ లను బుక్ చేసుకున్నాయి.