vara vara rao: వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం.. తక్షణమే ఆసుపత్రిలో చేర్చాలన్న బాంబే హైకోర్టు
- ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్యం కుదరదంటారా?
- తక్షణం నానావతి ఆసుపత్రికి తరలించండి
- మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవకవి వరవరరావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి నానావతి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిన్న విచారించింది. వరవరరావును తక్షణం ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రాణాలతో పోరాడుతున్న ఆయనకు చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా అంటారని జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం.. వరవరరావును ప్రత్యేక కేసుగా పరిగణిస్తామని, నానావతి ఆసుపత్రిలో చేర్పించి 15 రోజులపాటు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని కోర్టుకు తెలిపింది. అలాగే, వరవరరావును చూసేందుకు నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.