London: బ్రిటన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చేసిన ‘సీతారాములు’.. తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత
- నవంబరు 1978లో చోరీకి గురైనట్టు గుర్తించిన పోలీసుల
- లండన్ తరలిపోయి ఉండొచ్చన్న అనుమానంతో ఆధారాల సమర్పణ
- వాటిని వెతికి పట్టుకుని భారత అధికారులకు అప్పగించిన లండన్ పోలీసులు
భారతదేశంలో చోరీకి గురై, లండన్ తరలిపోయిన 13వ శతాబ్దంనాటి పురాతన సీతారామలక్ష్మణుల కాంస్య విగ్రహాలు ఎట్టకేలకు తిరిగి భారత్ చేరుకున్నాయి. సెప్టెంబరు 15న లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో వీటిని అప్పగించగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఢిల్లీలో నిన్న భారత పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ఆనందమంగళంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన శ్రీ రాజగోపాల్ విష్ణు ఆలయం నుంచి ఈ విగ్రహాలు చోరీ అయ్యాయి. ఇవి లండన్‌కు తరలిపోయి ఉండొచ్చని అనుమానించిన ఇండియా ప్రైడ్ ప్రాజెక్టు అధికారులు గతేడాది ఆగస్టులో లండన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి సమాచారం చేరవేశారు.
1958లో ఈ విగ్రహాలకు తీసిన ఫొటో ఒకటి భద్రంగా ఉండడంతో వాటిని వెతికి పట్టుకోవడం సులభమైంది. 1978 నవంబరు 23, 24 తేదీల్లో ఈ విగ్రహాలు చోరీ అయినట్టు గుర్తించిన తమిళనాడు పోలీసులు దొంగలను కూడా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత అధికారులు లండన్ పోలీసులకు అందజేయడంతో వారు దర్యాప్తు చేపట్టి విగ్రహాల యజమానిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత నెల 15న వాటిని లండన్‌లోని భారత దౌత్య కార్యాలయంలో అధికారులకు అప్పగించారు. ఫలితంగా ఇవి తిరిగి ఇండియాకు చేరుకున్నాయి.