Hyderabad: సెకండ్ వేవ్‌తో వణుకుతున్న విదేశాలు.. స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయులు!
- అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్
- అందరికీ వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వాలు
- హైదరాబాద్‌కు రోజుకు 2 వేల మంది రాక
యూరప్, అమెరికా దేశాల్లో కరోనా రెండో దశ ప్రారంభం కావడంతో ఆయా దేశాల్లోని భారతీయులు, ఇతర విదేశీయులు వణుకుతున్నారు. భయంతో అక్కడి నుంచి స్వదేశాలకు తిరుగుముఖం పడుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా విదేశీయులను పట్టుబట్టి మరీ స్వదేశాలకు పంపించేస్తున్నాయి. అంతేకాదు, వివిధ నేరాలకు పాల్పడి అక్కడి జైళ్లలో ఉన్న వారిని సైతం విడుదల చేసి తమ దేశం నుంచి పంపేస్తున్నాయి.
అలా వస్తున్న భారతీయులతో విమానాలు కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం 11 అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో ల్యాండ్ అవుతున్నాయి. వాటిలో రోజుకు 2 వేల మందికిపైగా వస్తున్నారు. వీరిలో చాలామంది కరోనా నెగటివ్ రిపోర్టులతో ఫ్లైట్ ఎక్కుతుండగా, మరికొందరు మాత్రం విమనాశ్రయంలో దిగిన వెంటనే పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వారి కోసం విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఓ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆయా దేశాల్లో అందరికీ వైద్య సదుపాయం అందించడం సవాలుగా మారడంతో విదేశీయులను స్వదేశానికి పంపించేస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ సహా యూరప్ దేశాలు, అమెరికా, సింగపూర్, దుబాయ్ నుంచి ఎక్కువ మంది భారత్ చేరుకుంటున్నారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో మరిన్ని సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు రెడీ అవుతున్నాయి. దీంతో మరో పది విమానాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 2 వేల మంది హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుండగా, ఈ సంఖ్య 4 వేలకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఓ నేరంలో తాను గత రెండేళ్లుగా ఇటలీలోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నానని, కరోనా కారణంగా తానుంటున్న జైలులో అనేకమంది మరణించడంతో విదేశీయులను విడుదల చేసి పంపించేస్తున్నారని, తనను కూడా అలాగే విడిచిపెట్టారని ఇటలీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తెలిపాడు.