West Bengal: మమతకు ఒవైసీ స్నేహ హస్తం.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సై!

Asaduddin Owaisi redady to fight in west bengal elections with mamata

  • బీజేపీని ఓడించేందుకు మమతతో చేతులు కలిపేందుకు ముందుకొచ్చిన అసద్
  • ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేసే యోచన
  • బీజేపీనే ఎంఐఎంను బరిలోకి దింపుతోందన్న విమర్శలు

తమ పార్టీని క్రమంగా విస్తరిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. మమతను గద్దె దింపి బెంగాల్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీని ఓడించేందుకు  మమత బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు అసదుద్దీన్ ప్రకటించారు.

బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం.. అదే ఊపును బెంగాల్‌నూ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీలు ఎక్కువగా ఉన్న  మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్‌లతోపాటు దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎంఐఎం యోచిస్తోంది.  

అయితే, ఎంఐఎం ప్రతిపాదనను టీఎంసీ అంగీకరించడం అనుమానంగానే ఉంది. ఎంఐఎం కనుక ఎంటరైతే రాష్ట్రంలో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలు ఎంఐఎంవైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని టీఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యేనన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్, వామపక్షాలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కనుక ఎంఐఎం కనుక రంగంలోకి దిగితే తృణమూల్ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉందని, ఫలితంగా బీజేపీకి మేలు జరుగుతుందని టీఎంసీ నేతలు చెబుతున్నారు.

నిజానికి మమతను దెబ్బతీసేందుకు బీజేపీనే ఓవైసీని దింపుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ లౌకిక పార్టీల ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను బీజేపీ తమ ‘బి-టీమ్’గా వాడుకుంటోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News