Roja: చంద్రబాబు రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు: తిరుమలలో రోజా ఘాటు వ్యాఖ్యలు

YCP MLA Roja compares CM Jagan and Chandrababu

  • కుటుంబ సభ్యులతో తిరుమల విచ్చేసిన రోజా
  • సీఎం జగన్ చిన్నవాడైనా భేష్ అంటూ పొగడ్తలు
  • హైదరాబాదులో దాక్కున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సోదరుడి పెళ్లిరోజు, తన మేనకోడలి పుట్టినరోజు కావడంతో నేడు స్వామివారి దీవెనలు అందుకునేందుకు వచ్చామని రోజా మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర రాజకీయాలపైనా స్పందించారు.

సీఎం జగన్ చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా, పారదర్శకంగా రాజకీయాలు నడపడం చూస్తున్నామని, కానీ చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలేనని విమర్శించారు. తిరుపతి ఎంపీ కరోనాతో చనిపోతే వెంటనే అభ్యర్థిని నిలబెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రం ఓవైపు కరోనాతో అతలాకుతలం అవుతుంటే, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలనో, భరోసా ఇవ్వాలనో ప్రయత్నించకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడంటూ చంద్రబాబును ఏకిపారేశారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు పార్టీ తరఫునో, తన తరఫునో మద్దతుగా నిలవాల్సిన చంద్రబాబు రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ చనిపోతే పార్టీలకు అతీతంగా వారి కుటుంబాలను ఆదుకుంటున్నారని, వారి కుటుంబాలకు పోటీగా అభ్యర్థిని నిలిపేందుకు సైతం ఆయన ఇష్టపడరని కొనియాడారు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎవరు చనిపోతారా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో తన చక్రం తిప్పాలా అని ఎదురుచూస్తుంటారని ఆరోపించారు.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ, బంధాలకు అనుబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వడం కానీ తెలియదని విమర్శించారు. నాడు కరోనా సాకుతో స్థానిక సంస్థలను అడ్డుకున్నారని, నేడు కరోనా లేదు అని తమకు తామే స్టేట్ మెంట్లు ఇస్తూ ఎన్నికలు జరపాల్సిందేనంటున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నీ తాము గెలుచుకుంటామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు దిగిపోయేనాటికి మూడున్నర లక్షల కోట్లు అప్పుల్లో ముంచేశారని, జగన్ పదవిలోకి వచ్చిన సమయంలో ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ జగన్ కుంటిసాకులు చెప్పకుండా, ఇచ్చిన హామీలన్నింటికీ న్యాయం చేస్తున్నారని రోజా ప్రశంసల వర్షం కురిపించారు. 16 నెలల పాలనలో 4 కోట్ల మందికి లబ్ది చేకూర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని స్పష్టం చేశారు.

సీఎంగా జగన్ మరో 30 ఏళ్లు పదవిలో ఉంటేనే తమ కష్టాలు గట్టెక్కి, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు నమ్ముతున్నారని, ఈ విషయాన్ని టీడీపీ వాళ్లు తెలుసుకోవాలని అన్నారు. ఇకనైనా శవరాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని, తమను 14 ఏళ్లు అధికారంలో ఉంచిన ప్రజలకు ఇకనైనా మద్దతుగా నిలవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News