Guntur District: గుంటూరు వైద్యుల ఘనత.. రోగికి ‘బిగ్‌బాస్’ షో చూపిస్తూ క్లిష్టమైన సర్జరీని నిర్వహించిన డాక్టర్లు!
- రోగిని స్పృహలో ఉంచి మెదడులోని కణితిని తొలగించిన వైద్యులు
- వైద్యుల్లో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందినవారు
- బీమా సౌకర్యం కారణంగా పైసా కూడా ఖర్చుకాని వైనం
ఓ రోగి మెదడులో మాటలు, సంభాషణకు అత్యంత కీలకమైన ప్రాంతంలో శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ (33)కు 2016లో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స జరిగింది.
అయితే, ఇటీవల గత కొన్ని నెలలుగా అతనికి ఫిట్స్ వస్తుండడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో కణితి మళ్లీ పెరుగుతున్నట్టు గుర్తించారు. దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించారు.
అయితే, మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి, మాట్లాడిస్తూ.. టీవీలో బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రోగి వరప్రసాద్‌కు ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారు కావడం గమనార్హం. బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, అతడికి బీమా సౌకర్యం ఉండడంతో పైసా కూడా ఖర్చు కాలేదని వైద్యులు తెలిపారు.