Jagan: 4 ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ లకు శంకుస్థాపన చేసిన జగన్
- రూ. 1,510 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లు
- రూ. 225 కోట్లతో 25 ఆక్వా హబ్ ల నిర్మాణం
- నియోజకవర్గానికి ఒక ఆక్వాహబ్ ఏర్పాటు చేస్తామన్న జగన్
ఏపీలో మత్స్య రంగానికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ లకు సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వర్చువల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉందని, అయినప్పటికీ మత్స్యకారుల జీవితాలు చాలా దయనీయంగా ఉన్నాయని అన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో గుజరాత్ వంటి ప్రాంతాలకు వలస పోతున్నారని చెప్పారు. పొడవాటి తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఫిషింగ్ హార్బర్లు లేవని అన్నారు. విదేశాల్లో మగ్గుతున్న తెలుగు మత్స్యకారులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చామని చెప్పారు.
మత్స్యకారుల కష్టాలు తీరిపోయేలా నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జగన్ చెప్పారు. నియోజక వర్గానికి ఒక ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి దశలో రూ. 1,510 కోట్లతో మచిలీపట్నం, నిజాంపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెల ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 225 కోట్ల ఖర్చుతో తొలుత 25 ఆక్వా హబ్ ల నిర్మాణం చేపడతామని అన్నారు.