Corona Virus: కరోనాను అంతం చేసే మౌత్ వాష్ అతి త్వరలో: యూనిలివర్
- 30 సెకన్లలోనే 99.9 శాతం వైరస్ అంతం
- త్వరలోనే మౌత్ వాష్ తప్పనిసరి అవుతుంది
- అభిప్రాయపడ్డ యూనిలివర్
కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే 99.9 శాతం కరోనా వైరస్ ను అంతమొందించే సరికొత్త మౌత్ వాష్ ను అతి త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నామని ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలివర్ వెల్లడించింది. అత్యాధునిక సీపీసీ టెక్నాలజీతో ఈ మౌత్ వాష్ ను తయారు చేశామని పేర్కొన్న సంస్థ, నోట్లో ఉన్న వైరస్ ను అంతం చేస్తే, వైరస్ వ్యాప్తిని మరింత సులువుగా అరికట్టే వీలుంటుందని సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడింది.
ప్రస్తుతం కరోనాను నిలువరించేందుకు చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ప్రస్తుతం తప్పనిసరి జాబితాలో ఉన్నాయని, త్వరలోనే మౌత్ వాష్ వాడటం కూడా తప్పనిసరి జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని సంస్థ పేర్కొనడం గమనార్హం. ఇండియాలో తమ అనుబంధ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ద్వారా డిసెంబర్ లో ఈ ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకు రానున్నామని సంస్థ ప్రకటించింది. దీనిలో 0.07 శాతం సెటిల్ పైరిడీనియమ్ క్లోరైడ్ కెమికల్ ఉంటుందని వెల్లడించింది.