Odisha: కబ్జాకు గురైన ఇంటి స్థలం.. సైకిలుపై 70 కిలోమీటర్లు ప్రయాణించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వృద్ధుడు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు
- నిర్మాణానికి సిద్ధమవుతుండగా కబ్జాకు గురైన స్థలం
- ఎస్పీకి, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కలెక్టరుకు ఫిర్యాదు చేసేందుకు 65 ఏళ్ల వృద్ధుడు సైకిలుపై 70 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఒడిశాలోని నువాపడ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని బరపదర గ్రామానికి చెందిన గణపతి దురియా అనే వృద్ధుడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు అయింది.
దీంతో ఇల్లు కట్టేందుకు గణపతి సిద్ధమయ్యాడు. అయితే, ఆలోగానే అతడి స్థలం కబ్జాకు గురైంది. దీంతో విస్తుపోయిన గణపతి స్థానిక తహసీల్దార్, ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తన భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తన స్థలాన్ని తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తన గ్రామానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి సైకిలుపై బయలుదేరాడు.
కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావించాడు. అయితే, అంతదూరం సైకిలుపై వెళ్లినా అతడికి నిరాశే ఎదురైంది. కరోనా నేపథ్యంలో కలెక్టర్‌ను కలిసేందుకు గణపతికి అనుమతి లభించలేదు. దీంతో తన వినతి పత్రాలన్నీ అక్కడ ఉన్న ఫిర్యాదుల పెట్టెలో వేసి ఇంటికి బయలుదేరాడు.