Rahul Gandhi: ఈ ప్రశ్నలకు ప్రధాని తప్పక సమాధానం చెప్పాలి: రాహుల్ గాంధీ
- మరికొన్ని నెలల్లో రానున్న కరోనా వ్యాక్సిన్లు
- ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు
- వ్యాక్సిన్ పంపిణీకి ఏదైనా వ్యూహం ఉందా? అంటూ ట్వీట్
కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు సాగిస్తున్న సంస్థలన్నీ వచ్చే ఏడాది ఆరంభంలో తమ వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఈ ప్రశ్నలపై దేశ ప్రజలకు తప్పక జవాబివ్వాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో నాలుగు ప్రశ్నలు సంధించారు.
1. ఎన్నో కరోనా వ్యాక్సిన్లు వస్తున్నాయి... వాటిలో భారత ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ ను ఎంచుకుంటుంది? ఆ వ్యాక్సిన్ నే ఎంచుకోవడానికి కారణాలేంటి?
2. వ్యాక్సిన్ వస్తే మొట్టమొదట ఎవరికి అందిస్తారు? వ్యాక్సిన్ పంపిణీకి ఏవైనా విధివిధానాలు ఉన్నాయా?
3. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు పీఎం కేర్స్ నిధులు అందించే ఆలోచన ఉందా?
4. భారతదేశ ప్రజలందరికీ ఎప్పటిలోగా వ్యాక్సిన్ ఇస్తారు?... అంటూ రాహుల్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.