Joe Biden: బలహీనుడైన జో బైడెన్ యుద్దాలను ప్రారంభించవచ్చు: చైనా ప్రభుత్వ సలహాదారుడు
- బైడెన్ హయాంలో సంబంధాలు మెరుగుపడతాయనే భ్రమల్లో ఉండొద్దు
- చైనాపై అమెరికా ప్రజల్లో ఆగ్రహం ఉంది
- చైనాకు వ్యతిరేకంగా బైడెన్ ఏదైనా చేయొచ్చు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా తన విధానాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ జయకేతనం ఎగురవేశారు. జనవరి 20న దేశాధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు, బైడెన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తే తమకు ఇబ్బందులు ఉండకపోవచ్చనే భావనలో చైనా ఉంది.
దీనిపై చైనా ప్రభుత్వ సలహాదారుడు, అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కంటెంపరరీ చైనా స్టడీస్ డీన్ అయిన జెంగ్ యాంగ్నియాన్ మాట్లాడుతూ, బైడెన్ పాలనలో అమెరికా-చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే భ్రమల నుంచి చైనా బయటకు రావాలని అన్నారు. అమెరికాతో ఒక కఠినమైన వైఖరిని తీసుకోవడానికి సన్నద్ధం కావాలని సూచించారు.
గతంలోని మంచి రోజులు ముగిసి పోయాయని జెంగ్ చెప్పారు. చాలా ఏళ్లుగా చైనాతో ఉన్న కోల్డ్ వార్ రాత్రికి రాత్రే ఆగిపోదని అన్నారు. చైనాపై అమెరికా ప్రజల్లో ఆగ్రహాన్ని జో బైడెన్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. బైడెన్ ఒక బలహీనమైన అధ్యక్షుడు అనే విషయంలో సందేహం లేదని అన్నారు. అమెరికా అంతర్గత సమస్యలను బైడెన్ పరిష్కరించలేకపోయిన పక్షంలో.. ఆయన దౌత్యపరంగా ఏదైనా చేసే అవకాశం ఉందని, చైనాకు వ్యతిరేకంగా ఏదైనా చేయవచ్చని చెప్పారు. ట్రంప్ కు యుద్ధాలపై ఆసక్తి లేదని.. కానీ డెమొక్రాటిక్ పార్టీ వ్యక్తి అయిన బైడెన్ యూద్ధాలను చేసే అవకాశం ఉందని అన్నారు.
ట్రంప్ పాలనలో చైనా-అమెరికా సంబంధాలు అత్యంత దారుణమైన స్థాయికి దిగజారాయి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు మరింత సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో బైడెన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు మళ్లీ బలోపేతమవుతాయని పలువురు చైనా నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో జెంగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.