Corona Virus: కరోనా వ్యాక్సిన్ రూట్ మ్యాపింగ్ ప్రక్రియ షురూ.. తపాలా శాఖకు పంపిణీ బాధ్యతలు
- ఫిబ్రవరి, మార్చి నాటికి దేశంలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్
- ట్రాన్స్పోర్టేషన్, పంపిణీ బాధ్యతలు పోస్టల్ శాఖకు
- గతంలో టీబీ వ్యాక్సిన్ను పంపిణీ చేసిన అనుభవం
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని దేశంలోని నలుమూలలకు పంపిణీ చేసేందుకు తపాల సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రూట్ మ్యాపింగ్ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది. టీకా రవాణా, కోల్డ్ చైన్ ఏర్పాటు వంటి మొత్తం పనులను తపాల శాఖ చూసుకోనుంది. నిజానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అసలైన సవాలు ఎదురుకానుంది.
ట్రాన్స్పోర్టేషన్, పంపిణీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దానిని సరైన ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు పోస్టల్ శాఖ వద్ద తగినన్ని వాహనాలు ఉన్నాయని, మారుమూల గ్రామాలకు కూడా పోస్టల్ నెట్వర్కింగ్ ఉండడంతో పంపిణీ సులభం అవుతుందని భావించిన ప్రభుత్వం దానికి ఆ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. గతంలో టీబీ వ్యాక్సిన్ను కూడా తపాల శాఖ పంపిణీ చేసిన అనుభవం ఉండడంతో ఇప్పుడు కరోనా టీకా బాధ్యతలను కూడా దానికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.