Corona Virus: తొలి విడతగా ఇండియాలో కోటి మంది వైద్య సిబ్బందికి ఒకేసారి వ్యాక్సిన్!

One Crore Frontline Warriors Gets Vaccine First

  • వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే టీకా
  • డేటా బేస్ సిద్ధమవుతోంది
  • 92 శాతం ప్రభుత్వ వైద్యుల పేర్లు వచ్చాయన్న అధికారులు

కరోనాకు టీకా అందుబాటులోకి రాగానే తొలి విడతలో కోటి మంది హెల్త్ వర్కర్లకు ఇవ్వాలని భావిస్తున్న కేంద్రం, అందుకు తగ్గ డేటాబేస్ ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో జరపనున్న సమావేశంలో ఈ విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగనుందని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. తొలుత ఏ వ్యాక్సిన్ విడుదలైతే, ఆ వ్యాక్సిన్ తొలి డోస్ ను ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని ఇప్పటికే గుర్తించామని, ఫ్రంట్ లైన్ యోధులకు వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే టీకా అందుతుందని అంచనా వేశారు.

ఇప్పటికే ప్రాధాన్యతా గ్రూప్ ను గుర్తించడంలో తుది దశకు చేరామని, డేటా బేస్ సైతం సిద్ధమవుతోందని, ఇమ్యునైజేషన్ డ్రైవ్ మొదలైతే, తొలి డోస్ వారికి తక్షణమే అందిస్తామని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఎక్స్ పర్ట్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. అయితే, ఓ వ్యాక్సిన్ ను వాణిజ్య పరంగా ఇండియాలో వినియోగించేందుకు ఐసీఎంఆర్ నుంచి తొలుత అనుమతి రావాల్సి వుందని అధికారులు తెలిపారు.

"ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి స్పందన వచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిలో 92 శాతం మంది పేర్లు మాకు అందాయి. ప్రైవేటు ఆసుపత్రులు తమ వద్ద పనిచేస్తున్న వైద్య సిబ్బందిలో 56 శాతం మంది వివరాలను ఇచ్చాయి. ఈ మొత్తం గ్రూప్ లో కోటి మంది వరకూ ఉంటారని అంచనా వేస్తున్నాము" అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ ఉదయం ప్రధాని మోదీతో పాటు సీఎంలతో జరిగే సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితరులు కూడా పాల్గొననున్నారు. జూలై 2021 నాటికి కనీసం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సిద్ధం చేసి 20 నుంచి 25 కోట్ల మందికి టీకాను వేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఇక ఇప్పుడు తయారవుతున్న గ్రూప్ లో ఎవరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రాధాన్యతలను నిర్ణయించుకోలేదని, వైద్యులంతా ఒకటేనని, ఒకసారి టీకా వేయడం ప్రారంభిస్తే, కోటి మందికీ అందిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మెడిసిన్, నర్సింగ్ చదువుతున్న విద్యార్థులను భాగస్వామ్యం చేసుకుంటామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News