Buggana Rajendranath: కరోనా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రూ. 981 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరాం: బుగ్గన
- కరోనా వల్ల ఖర్చు బాగా పెరిగింది
- మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని కోరాం
- పోలవరం అథారిటీ సిఫారసులు జలశక్తి శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయి
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుస్తున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తో ఆయన భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో బుగ్గన మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు.
కరోనా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరామని బుగ్గన చెప్పారు. మార్చి నెల నుంచి కరోనా పరీక్షలను పెంచామని, కోవిడ్ కేర్ సెంటర్లను పెంచామని... దీని వల్ల ఖర్చు భారీగా పెరిగిందని అన్నారు. ఇదే సమయంలో ఆదాయం తగ్గిందని తెలిపారు. కరోనా మరణాల రేటు ఏపీలో అత్యంత తక్కువగా ఉందని చెప్పారు. రూ. 981 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.
ఏపీలో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని బుగ్గన అన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతించాలని కేంద్ర ఆరోగ్యమంత్రిని కోరానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం అథారిటీ చేసిన సిఫారసులు కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.