Chidambaram: అవును.. అది ప్రమాదకరం: రఘురాం రాజన్ వ్యాఖ్యలకు మద్దతు పలికిన చిదంబరం

Chidambaram Critisises Centers Derision on Banking Sector

  • కార్పొరేట్ చేతుల్లోకి బ్యాంకులను నెట్టేస్తున్నారు
  • రిజర్వ్ బ్యాంక్ బలహీనపడుతుంది
  • తొలి లైసెన్స్ లు ఎవరికి వస్తాయో అందరికీ తెలిసిందే
  • వీడియోను విడుదల చేసిన చిదంబరం

ఇండియాలో కార్పొరేట్ కంపెనీలు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోని బ్యాంకింగ్ పరిశ్రమను తమ నియంత్రణలోకి తీసుకోవడం కోసం కొందరు ఆడుతున్న నాటకం ఇదని, దేశానికి ఇది చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇది ఆర్బీఐని కూడా బలహీనపరుస్తుందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనలు అమలైతే జాతి ఆర్థిక వనరులన్నీ కార్పొరేట్ సెక్టార్ చేతుల్లోకి వెళ్లిపోతాయని ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

రఘురామ్ వ్యాఖ్యలను సమర్థించిన చిదంబరం, "ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో మొత్తం డిపాజిట్లు రూ. 140 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయి. వ్యాపార సంస్థలు బ్యాంకులను ప్రారంభించేందుకు అనుమతిస్తే, అవి చాలా చిన్న చిన్న పెట్టుబడులతోనే దేశపు ఆర్థిక వనరులను తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి" అంటూ చిదంబరం ఓ వీడియోను విడుదల చేశారు. అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు తొలి లైసెన్స్ లు లభిస్తాయన్నది రహస్యమేమీ కాదని ఆయన అన్నారు.

కాగా, గతవారంలో ఈ ప్రతిపాదనలు తొలిసారిగా ప్రజల ముందుకు రాగా, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య సైతం తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని వ్యాపార సంస్థల జేబుల్లోకి భారత వ్యవస్థ వెళ్లిపోతుందని, ఈ నిర్ణయం బ్యాంకింగ్ సంస్కరణలకు దారితీసే బదులు, వ్యవస్థను నాశనం చేస్తుందని ఆయన తన లింకెడ్ ఇన్ నోట్ లో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News