GVL Narasimha Rao: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి: జీవీఎల్

BJP and Janasene alliance will contest in Tirupati Lok Sabha Bypolls

  • ఏపీలో అభివృద్ధి లేదు
  • తిరుపతికి వైసీపీ, టీడీపీ ఏం చేశాయో చెప్పాలి
  • కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి జరిగింది

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఏపీ రాజకీయాల్లో సరికొత్త చలనాన్ని తీసుకొచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత తొలి ఎన్నిక జరగబోతున్న తరుణంలో అధికార, విపక్ష పార్టీలు తొలిసారి ఎన్నికల బరిలో తలపడబోతున్నాయి. తాము ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలంటే అధికార వైసీపీకి ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి.

ఓవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ ఎన్నికలలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు బీజేపీ, జనసేనలు కూడా ఉమ్మడిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ అంశంపై మాట్లాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జీవీఎల్ చెప్పారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీలో అభివృద్ధి లేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం కుల, ధన రాజకీయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తిరుపతి అభివృద్ధి కోసం వైసీపీ, టీడీపీలు ఏం చేశాయో ముందు చెప్పాలని... ఏమీ చేయకుండానే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

 కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని చెప్పారు. టీడీపీ హయాంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని విమర్శించారు. తిరుపతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News