Nara Lokesh: సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు వేధింపులు: యువకుడి వీడియో పోస్ట్ చేసిన లోకేశ్
- యువకుడు బేతమల మణిరత్నాన్ని పోలీసులు వేధించారు
- ఫిర్యాదు నమోదుకాకపోయినా పోలీసు స్టేషన్‌కు రమ్మన్నారు
- ఖాళీ పేపరు మీద బలవంతంగా సంతకం చేయించుకున్నారు
పొన్నూరు దళిత యువకుడు బేతమల మణిరత్నాన్ని పోలీసులు విచారించడం పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసినందుకు, ఫిర్యాదు నమోదు కాకపోయినా కేసును రిజిస్టర్ చేయకుండానే మణిని పోలీసు స్టేషన్‌కు రమ్మన్నారు. ఖాళీ పేపరు మీద బలవంతంగా సంతకం చేయించుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త అయ్యారా?’ అని ప్రశ్నించారు.
‘మణి అరెస్టు వార్తలు ఫేక్ అని నిన్న ఎస్పీ అన్నారు. ఈ రోజు మాట్లాడుతూ విచారించడానికే మణిని పిలిచామని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు గాను పౌరులను ప్రశ్నించడానికి మీరు ఎవరు? రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి మీరు ఎవరు? ఫిర్యాదు నమోదు కాకుండానే పౌరులను ఎందుకు వేధిస్తున్నారు? మీ హద్దులు దాటి ప్రవర్తించొద్దని నేను సూచిస్తున్నాను. ప్రజల పట్ల విధేయతతో ఉండాలి కానీ, మీ రాజకీయ నేత పట్ల కాదు’ అని నారా లోకేశ్ విమర్శించారు. మణిరత్నం తన ఆవేదనను చెప్పుకుంటోన్న వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు.