Narendra Modi: శనివారం నాడు హైదరాబాదుకు వస్తున్న మోదీ.. కేసీఆర్ సభ సమయంలో నగర పర్యటన
- ఈనెల 28న హైదరాబాదుకు వస్తున్న మోదీ
- భారత్ బయోటెక్ కు వెళ్లనున్న ప్రధాని
- అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించనున్న మోదీ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ముగుస్తోంది. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ దూసుకుపోతోంది. పలువురు బీజేపీ జాతీయ నాయకులు నగరానికి వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు 28న ప్రధాని మోదీ కూడా హైదరాబాదుకు వస్తున్నారు. అయితే, మోదీ హైదరాబాదుకు వస్తున్నది ఎన్నికల ప్రచారం కోసం కాదనే విషయం గమనార్హం.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ఇటీవలే మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మరోవైపు మన దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీకి పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు పూణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాదులోని భారత్ బయోటెక్ సంస్థలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం సీరమ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాదుకు వస్తారు.
సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ హకీంపీట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ కు చేరుకుని అక్కడ జరుగుతున్న కోవాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 5.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.
అయితే, మోదీ హైదరాబాదులో ఉండే ఆ సమయంలోనే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఉండనుంది. మోదీ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేయకపోయినప్పటికీ... సీఎం సభ సమయంలోనే ఆయన ఇక్కడ ఉండనుండటంతో దాని ప్రభావం కొంతమేర ఓటర్లపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.