Nara Lokesh: వెన్నుచూపని అమరావతి పరిరక్షణ ఉద్యమందే అంతిమ విజయం: నారా లోకేశ్
- అమరావతి రాజధానిని చంపేసే కుట్రలు
- శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లపై కేసులు
- ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు
- మానవత్వమన్నదే మరిచిపోయి అరెస్ట్ చేయించారు
రైతులపై వైసీపీ సర్కారు తీరు సరికాదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ‘అన్నదాతలు వీరు.. అన్నంపెట్టే భూతల్లిని ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం త్యాగం చేసినవాళ్లు. అమరావతిని చంపేసే కుట్రల్ని నిరసిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లు. మా త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రజారాజధానికి సమాధి కట్టొద్దంటూ నినదించిన కృష్ణాయపాలెం రైతులు. మూడుముక్కలాటకి మద్దతుగా వచ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవడమే నేరంగా పరిగణించి, ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు’ అని లోకేశ్ అన్నారు.
‘పోలీసులకు ఫిర్యాదిచ్చిన వ్యక్తి కంప్లయింట్ వెనక్కి తీసుకున్నా, మానవత్వమన్నదే మరిచిపోయి అరెస్ట్ చేయించారు. దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేయించడం జగన్రెడ్డి శాడిజానికి పరాకాష్ట. కృష్ణాయపాలెం దళిత రైతులకి సంకెళ్లు వేసి జైలులో నిర్బంధించిన సమయంలో వారి కుటుంబాలను పరామర్శించాను. అండగా వుంటానని హామీ ఇచ్చాను. బెయిల్పై విడుదలై వచ్చిన దళిత రైతులు జగన్రెడ్డి సర్కారు తమని పెడుతున్న ఇబ్బందులు చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా, కొట్టినా, చంపినా కూడా వెన్నుచూపని అమరావతి పరిరక్షణ ఉద్యమందే అంతిమ విజయం. రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా వుంటుందని హామీ ఇచ్చాను’ అని తెలిపారు.