Narendra Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. స్వాగతానికి ఐదుగురికి మాత్రమే అవకాశం
- హైదరాబాద్ సహా పూణె, అహ్మదాబాద్ నగరాల్లోనూ ప్రధాని పర్యటన
- భారత్ బయోటెక్‌కు వెళ్లి కరోనా టీకా కోవాగ్జిన్ పురోగతిపై పరిశీలన
- ప్రధానికి స్వాగతం పలికే వారిలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు
భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీకి హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నట్టు తెలిపారు.
అయితే, ఈ కార్యక్రమానికి ఐదుగురికి మాత్రమే అనుమతి లభించినట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి, హకీంపేట ఎయిర్‌పోర్టు ఆఫీస్ కమాండెంట్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి జినోమ్ వ్యాలీకి ప్రధాని వెళతారు. అక్కడ భారత్ బయోటెక్‌ను సందర్శించి ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉన్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ గురించి అడిగి తెలుసుకుంటారు. అక్కడ దాదాపు గంటసేపు గడిపిన అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాగా, ప్రధాని మోదీ హైదరాబాద్‌తోపాటు పూణె, అహ్మదాబాద్ నగరాల్లోనూ పర్యటించి కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న సంస్థలను సందర్శించి పురోగతి పరిశీలించనున్నారు.