Pawan Kalyan: నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడడం నాకింకా గుర్తే: ప్రకాశ్‌రాజ్‌పై నాగబాబు ఫైర్
- ప్రతి పనికిమాలిన వాడు విమర్శించడమే
- నిర్ణయాలు మార్చుకోవడం వెనక దీర్ఘకాలిక ప్రయోజనాలు
- నీలాంటి వాళ్లు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరు
- ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిది
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలుత పోటీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తప్పుబట్టిన నటుడు ప్రకాశ్‌రాజ్‌పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశ్ రాజ్ చరిత్ర ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పారని గుర్తుచేస్తూ ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నిర్ణయాలు పలుమార్లు మారుతుంటాయని, అలా మార్చుకోవడం వెనక దీర్ఘకాలంలో ప్రజలకు, పార్టీకి ప్రయోజనం ఉంటుందని అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ నాయకుడు పవన్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయన్న నాగబాబు.. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ డిబేట్లో సుబ్రహ్మణ్యస్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడడం తనకింకా గుర్తుందని అన్నారు. బీజేపీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పులేదని, కానీ మంచి చేస్తే మెచ్చుకోలేని కుసంస్కారం గురించి ఏం చెప్పగలమని నాగబాబు అన్నారు.
దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరన్నారు. బీజేపీని ఎంతగా విమర్శిస్తున్నా, ఆ పార్టీ తిరిగి ఏమీ అనడం లేదంటే ప్రజాస్వామ్యానికి బీజేపీ ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకోవాలని ప్రకాశ్‌రాజ్‌కు హితవు పలికారు. నిర్మాతలను డబ్బుల కోసం హింసించిన సంగతి, డేట్స్ ఇచ్చి రద్దు చేసిన సంగతి అన్నీ గుర్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ గురించి ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని నాగబాబు హెచ్చరించారు.