USA: ముంబై దాడుల సూత్రధారి తలపై రూ.37 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా
- ముంబై 26/11 బాంబు పేలుళ్లు జరిగి 12 ఏళ్లు
- సాజిద్ మీర్ తలపై అమెరికా రివార్డు
- లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్
ముంబై 26/11 బాంబు పేలుళ్లు జరిగి 12 ఏళ్లు గడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్ తలపై అమెరికా ఐదు మిలియన్ డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) బహుమతి ప్రకటించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్ ముంబై 26/11 బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన పాత్ర పోషించాడని అమెరికా స్పష్టం చేసింది.
అతడిని 2011లో అమెరికాలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్టు దోషిగా తేల్చిందని చెప్పింది. అతడు ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడని గుర్తు చేసింది. కాగా, 2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపి 166 మంది ప్రాణాలు తీశారు. వీరిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వందల మంది సామాన్యులు మృతి చెందారు. ఈ పేలుళ్లు జరిపిన తొమ్మిది మందిని భద్రతా సిబ్బంది అక్కడే హతమార్చారు. సజీవంగా పట్టుబడిన మరో ఉగ్రవాది కసబ్‌ను 2012లో ఉరితీశారు.