Corona Virus: కరోనా వైరస్ భారత్ లో పుట్టి ఉంటుంది: చైనా శాస్త్రవేత్తల కొత్త వాదన

China researchers says India was the birth place of corona virus

  • కరోనా మూలాలు భారత్, బంగ్లాదేశ్ లో ఉన్నాయని వెల్లడి
  • జంతువుల నుంచి మనుషులకు సోకిందన్న పరిశోధకులు
  • సందేహాలు వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ నిపుణులు

కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ లో అని అగ్రరాజ్యం అమెరికా నుంచి దాదాపు అన్ని దేశాలు వాదిస్తుండగా, చైనా శాస్త్రవేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా మహమ్మారి పుట్టుక మూలాలు భారత్ లో ఉండొచ్చంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. భారత్, బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ ఉత్పన్నమై ఉంటుందని చెబుతున్నారు. 2019 డిసెంబరులో వుహాన్ లో కరోనా వ్యాప్తి చెందగా, అంతకుముందే భారత్, బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ఉనికి వెల్లడైందని చైనాలోని షాంఘై ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు వివరించారు.

కొవిడ్-19 పుట్టింది తమ దేశంలో కాదనడానికి ఆధారాలు ఉన్నాయని, 2019 వేసవిలోనే ఇది భారత గడ్డపై పుట్టిందని, జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా మానవులకు సంక్రమించిందని చైనా పరిశోధకులు వెల్లడించారు. వుహాన్ లో పుట్టిందే నిజమైన కరోనా వైరస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వారు స్పష్టం చేశారు.  

వైరస్ మూలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా వివిధ రకాల జన్యు ఉత్పరివర్తనాలను పరిశోధించడం ద్వారా ఫైలోజెనెటిక్ విశ్లేషణ కూడా చేపట్టామని వెల్లడించారు. 2019 వేసవిలో పాకిస్థాన్ వైపు నుంచి వీచిన వేడిగాలులతో భారత్ లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడిందని, తత్ఫలితంగా జంతువులు, మానవులు ఒకే నీటిని తాగడంతో ఉద్భవించిన కరోనా వైరస్ రక్కసి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని షాంఘై ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు విశ్లేషించారు.

కాగా, ఈ చైనా పరిశోధకుల వాదనను భారత్ సహా ఇతర దేశాల్లోని పరిశోధకులు ఎవరూ విశ్వసించడంలేదు. భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేశ్ ఠాకూర్ షాంఘై ఇన్ స్టిట్యూట్ అధ్యయనంలోవి అన్నీ తప్పుడు వాదనలేనని ఖండించారు. అంతర్జాతీయ నిపుణుడు డేవిడ్ రాబర్ట్ సన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. రాబర్ట్ సన్ సహా మరికొందరు చైనా వాదనలపై సందేహం వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News