TTD: టీటీడీ పాలకమండలి సమావేశం వివరాలు ఇవిగో!
- వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ సమావేశం
- ఇకపై 10 రోజల పాటు వైకుంఠ ద్వార దర్శనం
- జిల్లాల్లో కల్యాణమస్తు పునరుద్ధరణ
- ప్రైవేటు భద్రతా సిబ్బందికి యూనిఫాం భత్యం
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలక మండలి ఇవాళ సమావేశైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధం సఫలమైందని తెలిపారు. తిరుమలలో విద్యుత్ ఆధారిత బస్సులు తిప్పాలని భావిస్తున్నామని, ఈ విషయం సీఎం జగన్ కు విన్నవిస్తే ఆయన సానుకూలంగా స్పందించి 100 నుంచి 150 బస్సులు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
ముఖ్యంగా, ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవాలని నిర్ణయించామని, గతంలో ఒక్కరోజే ఈ తరహా దర్శనం అమల్లో ఉండేదని చెప్పారు. ఇకపై వైకుంఠ ద్వారాన్ని 10 రోజుల పాటు తెరవాలన్న నిర్ణయంపై మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించామని, వారు తమ సమ్మతి తెలిపారని వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తామని వివరించారు.
అంతేకాకుండా, గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమం చేపట్టేదని, ఇకమీదట ఆ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాల్లో పునరుద్ధరించదలిచామని చెప్పారు. తిరుమలలో పనిచేసే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి యూనిఫాం భత్యం కింద రూ.2000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని వైవీ వెల్లడించారు.