Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కృష్ణా జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లో రెండంకెల కేసులే!
- గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు
- 625 మందికి కరోనా పాజిటివ్
- కృష్ణా జిల్లాలో అత్యధికంగా 103 కేసులు
- అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 16 కేసులు
కొన్ని నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో కరోనా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గత వేసవిలో తీవ్ర ఆందోళనకర రీతిలో వెల్లడైన కొత్త కేసులు, ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా వెల్లడైన బులెటిన్ లో ఈ విషయం గమనించవచ్చు. ఒక్క కృష్ణా జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో రెండంకెల్లోనే కరోనా కేసులు వచ్చాయి.
కృష్ణా జిల్లాల్లో 103 కొత్త కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 16, కడప జిల్లాలో 19, అనంతపురం జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 22, నెల్లూరు జిల్లాలో 24 కేసులు వచ్చాయి. తాజా అప్ డేట్ ను పరిశీలిస్తే... గడచిన 24 గంటల్లో 49,348 కరోనా టెస్టులు నిర్వహించగా 625 మందికి కరోనా నిర్ధారణ అయింది. 1,186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 5 మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,981కి పెరిగింది.
కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,67,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,48,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,571 మంది చికిత్స పొందుతున్నారు.