Pfizer: ఫైజర్ టీకా రవాణాకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు
- పంపిణీకి సిద్ధంగా 6.4 మిలియన్ డోసులు
- ఎఫ్‌డీఏ అనుమతులు రాగానే పంపిణీ షురూ
- టీకా రవాణా కోసం కార్గో విమానాల వినియోగం
అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకాను అతి తక్కువ సమయంలో రవాణా చేసేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ అనుమతులు సంపాదించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతులు వచ్చిన వెంటనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పని ప్రారంభించనుంది. వచ్చే నెల 10న అనుమతుల కోసం టీకాను ఎఫ్‌డీఏకు పంపనున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నారు.
నిజానికి టీకాను రవాణా చేయాలంటే తొలుత దానిని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (ఎఫ్ఏఏ) అనుమతితో పెద్ద మొత్తంలో పొడి ఐస్‌ను విమానాల్లో తరలించనున్నారు. అలాగే, చిన్న పరిమాణంలో ఉండే సూట్‌కేసుల వంటి వాటిలో టీకాలను పెట్టి రవాణా చేయాలని అధికారులు నిర్ణయించారు.
రవాణా కోసం కార్గో విమానాలను వినియోగించాలని నిర్ణయించిన అధికారులు బ్రసెల్స్, చికాగో విమనాశ్రయాల నుంచి విమానాలను నడిపేందుకు ఎఫ్ఏఏ అనుమతి తీసుకున్నారు. అలాగే, మొత్తం 6.4 మిలియన్ డోసుల టీకా పంపిణీకి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.