Corona Virus: వాడకానికి సిద్ధంగా ఉన్న కరోనా వ్యాక్సిన్: అదార్ పూనావాలా
- రెండు వారాల్లోనే అనుమతి కోరతాం
- చక్కగా పనిచేస్తున్న కోవిఫీల్డ్
- కరోనాను ఎదుర్కొంటున్న యాంటీబాడీలు
తమ ల్యాబ్ లో కరోనా వ్యాక్సిన్ తయారైందని, అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని తాము కేంద్రాన్ని అభ్యర్థించనున్నామని సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సీరమ్ ప్లాంటును సందర్శించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరో రెండు వారాల వ్యవధిలో లైసెన్స్ ల కోసం కేంద్రాన్ని కోరనున్నామని వెల్లడించిన ఆయన, అత్యవసర వినియోగం నిమిత్తం ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికా టీకా సిద్ధంగా ఉందన్నారు.
ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఎన్ని డోస్ లను కొనుగోలు చేస్తుందన్న విషయమై ఎటువంటి చర్చలూ జరగలేదని, జూలై 2021 నాటికి 30 నుంచి 40 కోట్ల డోస్ లను దేశీయ వాడకం నిమిత్తం అందించగలమని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా అత్యవసర వినియోగం నిమిత్తం వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
కాగా, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె నగరాల్లో పర్యటించి, వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఫార్మా కంపెనీల ప్లాంట్లను సందర్శించిన సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ పనితీరుపై కొంతమంది ప్రశ్నలు తలెత్తిన విషయాన్ని ప్రస్తావించిన పూనావాలా, వ్యాక్సిన్ పనితీరును తెలుసుకునేందుకు అవసరమైన ట్రయల్స్ కన్నా ఎక్కువ మందికే టీకాను పరిశీలన నిమిత్తం ఇచ్చామని, ఇకపై 18 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చి చూస్తామని తెలిపారు.
గ్లోబల్ ట్రయల్స్ లో కోవిఫీల్డ్ ఎంతో ప్రభావాన్ని చూపిస్తోందని తేలిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని, వ్యాక్సిన్ తీసుకోవడంతో శరీరంలో పెరిగిన యాంటీ బాడీలు, కరోనాను ఎదుర్కొంటాయని, కరోనా సోకినా వారి ద్వారా మరొకరికి వ్యాధి వ్యాపించదని పూనావాలా తెలియజేశారు.