sri sailam: భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం!
- కలిసొచ్చిన సోమవారం, కార్తీక పౌర్ణమి
- శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
- అన్నవరంలో ప్రత్యేక వ్రతాలు
కార్తీక పౌర్ణమితో పాటు పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కూడా కలిసి రావడంతో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీభమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ తెల్లవారుజాము నుంచే పాతాళగంగ వద్ద స్నానాలు చేసేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం, భక్తుల దర్శనాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు అనుమతించారు. ఇక శ్రీశైలం పురవీధుల్లో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకూ భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, తమ భక్తిని చాటుకుంటున్నారు.
శ్రీశైలంతో పాటు పంచారామాలు, శ్రీకాళహస్తి, అన్నవరం క్షేత్రాలు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సముద్ర స్నానాలకు, నదీ స్నానాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గోదావరి గోష్పాద రేవుతో పాటు, విజయవాడ భవానీ ఘాట్ కిటకిటలాడుతున్నాయి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పెద్దఎత్తున క్యూలైన్లలో వేచివున్నారు. విశాఖపట్నం సముద్రతీరం వద్ద కార్తీక స్నానాలు చేసేందుకు ప్రజలు భారీగా వచ్చారు.