Jagan: చంద్రబాబు కావాలనే ఇలా చేస్తున్నారు: సీఎం జగన్
- ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- తొలిరోజే రణరంగం
- పోడియం ముందు బైఠాయించిన చంద్రబాబు
- సభకు అడ్డుతగులుతున్నారంటూ సీఎం వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజున అనేక ఆసక్తికర పరిణామాలకు సభ వేదికగా నిలిచింది. తుపానుతో రైతులకు తీవ్ర నష్టం జరగడంపై చర్చ నిర్వహించగా, సీఎం జగన్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా, అధికార వైసీపీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఆపై వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు కావాలనే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సభ జరిగేదే ఐదు రోజులు అని అన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటునే నడపడంలేదని, తెలంగాణలోనూ ఇదే కారణంతో అసెంబ్లీ సమావేశాలు జరగడంలేదని అన్నారు. అయితే కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు కొన్నిరోజుల పాటు సభ జరుపుతున్నామని వివరించారు. ఇలాంటి కీలక సమయంలో సభ జరగనివ్వకుండా విపక్ష నేతలు అడ్డుకుంటున్నారని, ఏనాడూ ఓ విపక్ష నేత ఫ్లోర్ లో బైఠాయించింది లేదని తెలిపారు.
గతంలో తాను కూడా విపక్ష నేతగా వ్యవహరించినా, ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఉద్దేశపూర్వకంగా సభకు అడ్డుతగలాలన్న కారణంతో పోడియం ముందు కూర్చున్నాడని సీఎం జగన్ ఆరోపించారు.