Narendra Modi: గంగామాత ఒడ్డుమీద నుంచి చెపుతున్నా... మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు: మోదీ
- మా ఆలోచనలు గంగా జలం అంత పవిత్రమైనవి
- రైతులు ధనవంతులు కావద్దా?
- కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన కండిషన్లు రైతుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కేబినెట్ సహచరులతో అమిత్ షా వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు.
మరోవైపు వారణాసి పర్యటనలో ఉన్న మోదీ వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ, దశాబ్దాలుగా తప్పుడు మాటలతో రైతులను మోసం చేశారని... అందువల్ల రైతుల్లో అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. పవిత్ర గంగామాత ఒడ్డున నిలబడి తాను చెపుతున్నానని... మోసం చేయాలనే ఉద్దేశాలతో తాము పని చేయడం లేదని అన్నారు. గంగా జలం ఎంత పవిత్రమైనదో తమ ఆలోచనలు కూడా అంతే పవిత్రమైనవని చెప్పారు.
ఇంతకు ముందు ఉన్న సిస్టమే కరెక్ట్ అని కొందరు వాదిస్తున్నారని... పాత వ్యవస్థలో ఉన్న వాటిని కొత్త చట్టాలు ఎక్కడ ఆపుతున్నాయని మోదీ ప్రశ్నించారు. కొత్త చట్టాల వల్ల మండీలు మూతపడవని, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. భారత వ్యవసాయ రంగం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిందని, పెద్ద మార్కెట్ లో రైతులు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందని, రైతులు ధనవంతులు కావద్దా? అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.