Vijay Sai Reddy: నీ పగటి వేషాలను ఎవరూ నమ్మరు బాబూ: విజయసాయిరెడ్డి
- నువ్వు రైతుల కోసం అంటూ డ్రామాలు ఆడుతున్నావు
- వ్యవసాయం దండగన్నావ్
- బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించావ్
- గతంలో రైతుల ఆత్మహత్యలకు ఏపీని రాజధానిగా మార్చేశావ్
రైతులకు న్యాయం చేయాలంటూ తమ పార్టీ నేతలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న డిమాండ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నువ్వు రైతుల కోసం అంటూ చేసే డ్రామాలు, పగటి వేషాలను ఎవరూ నమ్మరు బాబూ. వ్యవసాయం దండగన్నావ్, బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించావ్, గతంలో రైతుల ఆత్మహత్యలకు ఏపీని రాజధానిగా మార్చేశావ్. వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాలా? అని వెటకారం చేశావ్. గిట్టుబాటు ధర అడిగితే కొవ్వెక్కి పంటలు పండిస్తున్నారని కూశావ్’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘రైతులను మోసం చేసి, వాళ్లకి నువ్వు ఎగ్గొట్టిన బకాయిలను జగన్ గారు చెల్లిస్తున్నారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది రైతు ప్రభుత్వం. మీరు 3 సార్లు సీఎం అయింది మాత్రం గాలివాటంగానే. ఒకసారి ఎన్టీఆర్ ను గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు. 1999, 2014లో బీజేపీ ప్రభంజనంలో బయటపడ్డారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? 50% ఓట్లు, 151 సీట్లతో ప్రజలు జగన్ గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.