Chandrababu: ఏపీ అసెంబ్లీలో వాడీవేడీ.. చంద్రబాబుపై సీరియస్ అయిన స్పీకర్!
- రెండో రోజు కూడా గందరగోళంగా కొనసాగుతున్న సమావేశాలు
- స్పీకర్ ను వేలెత్తి చూపుతూ మాట్లాడిన చంద్రబాబు
- స్పీకర్ నే బెదిరిస్తారా? అంటూ తమ్మినేని ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉద్రిక్తభరితంగా కొనసాగుతున్నాయి. ఈ నాటి సమావేశాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నాటి సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
టిడ్కో ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. స్పీకర్ వైపు వేలెత్తి చూపుతూ చంద్రబాబు మాట్లాడారు. తాము మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై స్పీకర్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే విధానం ఇది కాదంటూ స్పీకర్ అన్నారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా? అని ఫైర్ అయ్యారు. మీ శాపనార్థాలకు, బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు. మాట్లాడేందుకు ఇంతకు ముందు అవకాశాలు ఇవ్వలేదా? ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పారు. శాసనసభలో నిలబడితే అద్దం ముందు నిలబడినట్టేనని... సభలో సభ్యలు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డుపడొద్దని హితవు పలికారు.