Supreme Court: జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు
- సీజేఐకి జగన్ రాసిన లేఖపై పిటిషన్లు దాఖలు
- సీఎంను తొలగించాలన్నది విచారణకు అనర్హమన్న సుప్రీం
- సీజేఐకి రాసిన లేఖ పరిశీలనలో ఉందని వెల్లడి
ఇటీవలే ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై వ్యాఖ్యలు చేస్తూ సీజేఐకి రాసిన లేఖ మీడియాకు విడుదల చేయడం ద్వారా ఏపీ సీఎం జగన్ న్యాయవ్యవస్థ ధిక్కరణకు పాల్పడ్డారని జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిలో ఉండేందుకు అనర్హుడని, ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, దినేశ్ మహేశ్వరి, హృషికేశ్ రాయ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి పిటిషన్లు వేయడం ఏంటని న్యాయస్థానం పిటిషనర్లను ప్రశ్నించింది. పైగా, పిటిషన్ లో పేర్కొన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. అసలు, సీఎం పదవి నుంచి తొలగించాలన్న అంశానికి విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. సీజేఐకి సీఎం జగన్ రాసిన లేఖ మరో ధర్మాసనం పరిశీలనలో ఉందని జస్టిస్ కిషన్ కౌల్ బెంచ్ వెల్లడించింది.
కాగా, ఈ జగన్ లేఖకు సంబంధించిన వ్యవహారంలో మొత్తం 3 పిటిషన్లు దాఖలు కాగా, పై కారణాలతో రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను మాత్రం ఇదే అంశంలో ఏపీ సర్కారు చేసిన అప్పీల్ తో కలిపి విచారించాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టుపైనా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని సునీల్ కుమార్ సింగ్ తన పిటిషన్ లో కోరారు.
న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగంలోని 121వ ఆర్టికల్ ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై పార్లమెంటులోనైనా సరే ఎలాంటి చర్చ జరగకుండా ఈ అధికరణే నిషేధిస్తుందని సునీల్ కుమార్ సింగ్ తన పిటిషన్ లో వివరించారు. కాగా, నేటి విచారణలో సునీల్ కుమార్ సింగ్ తరఫున వాదించిన ముక్తి సింగ్ వ్యాఖ్యానిస్తూ... గతంలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేసులోనూ ఓ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయలేడన్న విషయం నిరూపితమైందని ఉదహరించారు.
వాదనలు విన్న సంజయ కిషన్ కౌల్ ధర్మాసనం స్పందిస్తూ... ఏపీ ప్రభుత్వం గతంలో చేసిన అప్పీల్ పెండింగ్ లో ఉందని, ఆ అప్పీల్ తో సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ ను ట్యాగ్ చేస్తున్నామని వివరించింది. కొట్టివేసిన రెండు పిటిషన్ల అంశంలోనూ సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "వార్తా పత్రికల్లో వచ్చిన అంశాలను ఏరుకుని మీ ఇష్టం వచ్చినట్టు గుదిగుచ్చుకోండి, కానీ ఇది ఇలా చేయగలిగిన విషయం కాదు. సహకరించడానికి 100 మంది వస్తే ఆ వంద మందినీ జోక్యం చేసుకోమని ఎలా చెప్పగలం? ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇదొక అంతం లేని కసరత్తు అవుతుంది" అని వివరించింది.
అలాగే, అమరావతి భూ కుంభకోణం అంశంపై ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటనలు చేయకుండా నిగ్రహం పాటించేలా ఆదేశించాలంటూ ఓ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందిస్తూ, ఆ అంశంపై ఈ కోర్టు ఇప్పటికే గ్యాగ్ ఆర్డర్ ను ఎత్తేసినప్పుడు అలాంటి విజ్ఞప్తికి ఆస్కారమే లేదని వ్యాఖ్యానించింది.