Tunnel: ఆ సొరంగ ద్వారం పాక్‌లోనే.. దాయాది భూభాగంలోకి 200 మీటర్లు వెళ్లిన బీఎస్ఎఫ్!
- సొరంగ మార్గాన్ని ఉపయోగించి భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు
- నగ్రోటా వద్ద గత నెలలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
- సాక్ష్యాల కోసం సొరంగంలో వీడియో తీసిన సైన్యం
నగ్రోటా వద్ద ఇటీవల భారత భద్రతా బలగాల చేతిలో హతమైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లో చొరబాటుకు ఉపయోగించిన రహస్య సొరంగ మార్గాన్ని బీఎస్ఎఫ్ ఇటీవల గుర్తించింది. తాజాగా, ఆ సొరంగం ప్రారంభాన్ని అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా ఓ బృందం సొరంగంలోకి ప్రవేశించి దానివెంట 200 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి ప్రయాణించారు. ఈ సందర్భంగా దాని ప్రారంభం పాకిస్థాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. తిరిగి వచ్చేటప్పుడు సాక్ష్యాధారాల కోసం వీడియో తీసినట్టు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు.
కశ్మీర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను భగ్నం చేసే లక్ష్యంతో భారత్‌లోకి ప్రవేశించిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను గత నెల 19న జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా వద్ద భద్రతా దళాలు కాల్చి చంపాయి. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో వారి నుంచి ఆయుధాలు లభ్యం కావడంతో విచారణ చేపట్టిన అధికారులకు సొరంగ మార్గం ద్వారా వారు కశ్మీర్లో ప్రవేశించినట్టు తెలిసింది.