Farmers protest: రైతులకు మాజీ క్రీడాకారుల మద్దతు.. పురస్కారాలు వెనక్కి!
- నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతుల ఆందోళన
- ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొననున్న మాజీ క్రీడాకారులు
- రాష్ట్రపతి భవన్ వెలుపల పురస్కారాలను వదిలిపెట్టనున్న వైనం
ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలతోపాటు క్రీడాకారుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రైతుల ఆందోళనపై బలగాలను ప్రయోగించడాన్ని తప్పుబట్టిన పలువురు మాజీ క్రీడాకారులు వారికి మద్దతుగా నిలిచారు.
ఇందులో భాగంగా గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కర్తార్ సింగ్; అర్జున అవార్డు గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సజ్జన్ సింగ్ చీమా; అర్జున అవార్డు గ్రహీత, హాకీ క్రీడాకారుడు రాజ్బీర్ కౌర్ తదితరులు ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.