Buggana Rajendranath: ప్రజల సొమ్మును 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు యత్నం: మంత్రి బుగ్గన ఆరోపణలు
- టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నష్టాల్లోకి
- యూనిట్ రూ.2 దొరికే చోట రూ.4.83 పైసలకు కొనుగోలు
- 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. యూనిట్ రూ.2 దొరికే చోట రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారని అన్నారు. ప్రజల సొమ్మును 42 మందికి ధారాదత్తం చేసేందుకు 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడి చర్యతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయలు భారం పడిందని అన్నారు. ఆ పరిస్థితుల్లో పవన విద్యుత్ గురించి రివ్యూ చేశామని, 45 రోజుల్లో ఎంటరైన 42 అగ్రిమెంట్లపై సమీక్షించామని తెలిపారు. సాధారణంగా విండ్ మిల్లు పెట్టాలంటే సంవత్సరం సమయం పడుతుందని, అయితే, 45 రోజుల్లోపే ఒప్పందం, 45 రోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తి కూడా చేసినట్లు టీడీపీ ప్రభుత్వం పేర్కొందని తెలిపారు.
ఆ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన వారికి యూనిట్‌కు 50 పైసలు ఇన్సెంటీవ్ ఇచ్చినట్లు చెప్పుకుందని, ఇవన్నీ లెక్క చూస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చిందని బుగ్గన అన్నారు. ప్రజలు కట్టే పన్ను ఆదాయాన్ని ఇలా 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు యత్నించారని చెప్పారు. ఆయన చేసిన పని తప్పు అని చెప్పేందుకే తాము పవన విద్యుత్‌పై రివ్యూ చేశామని చెప్పారు.