Tirumala: తిరుమలలో క్రమంగా పెరుగుతున్న రద్దీ!
- నిన్న 27 వేల మందికి పైగా దర్శనం
- హుండీ ద్వారా రూ. 1.55 కోట్ల ఆదాయం
- కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న టీటీడీ
కరోనా భయం క్రమంగా తొలగుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ, తిరుమలలో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇదే సమయంలో రోజుకు 19 వేల మందికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా మొత్తం అమ్ముడు అవుతుండటంతో సగటున 25 వేల మందికి పైగా భక్తులు నిత్యమూ స్వామిని దర్శించుకుంటున్నారు. బుధవారం నాడు 27,180 మంది శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 1.55 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.