French: 94 ఏళ్ల వయసులో కరోనాతో కన్నుమూసిన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు గిస్కర్డ్
- దాదాపు ఏడేళ్లపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన గిస్కర్డ్
- అనారోగ్యంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరిన మాజీ అధ్యక్షుడు
- గిస్కర్డ్ హయాంలో పలు సంచలన చట్టాలు
48 ఏళ్ల వయసులో 1974లో ఫ్రాన్స్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించి 1981 వరకు పనిచేసిన గిస్కర్డ్ డి ఎస్టేయింగ్ కరోనాకు బలయ్యారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. సెప్టెంబరు 30న చివరిసారి కనిపించిన ఆయన ఇటీవల శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అంతకుముందు ఆయన పలుమార్లు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
గిస్కర్డ్ తన హయాంలో పలు సంచలన చట్టాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా గర్భస్రావాలను చట్టబద్ధం చేశారు. అలాగే, పరస్పర అంగీకారం ద్వారా విడాకులకు అనుమతించే చట్టాన్ని తీసుకొచ్చారు. పశ్చిమ జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్మెట్ స్మిత్‌తో సన్నిహిత సంబంధాలున్న గిస్కర్డ్ మృతికి ప్రపంచ నేతలు సంతాపం తెలిపారు. కాగా, గిస్కర్డ్ అత్యధిక కాలం జీవించిన మాజీ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.