Police: హైదరాబాద్ పోలీసులపై తప్పుడు ప్రచారం.. క్రిమినల్ కేసులు: సీపీ అంజనీ కుమార్
- 92 మంది పోలీసుల సస్పెన్షన్.. అంటూ ప్రచారం
- ఇందులో నిజం లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్య
- గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించినట్లు అసత్య ప్రచారం
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొందరు ఏకంగా పోలీసుల గురించి తప్పుడు ప్రచారం చేయడం అలజడి రేపుతోంది. హైదరాబాద్లో 92 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో నిజం లేదని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక మండలి ఎన్నికల్లో పలు పార్టీల అభ్యర్థులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ట్విట్టర్లోనూ ఆయన సూచించారు.