Jagan: రామానాయుడుకు మాట్లాడే హక్కు కూడా లేదు.. ప్రివిలేజ్ మోషన్ ను ప్రతిపాదిస్తున్నా: జగన్ సీరియస్
- సంక్షేమ పథకాలపై ఏపీ అసెంబ్లీలో రచ్చ
- నిమ్మల రామానాయుడు అబద్ధాలు మాట్లాడుతున్నారన్న జగన్
- డ్రామానాయుడిలా తయారయ్యారన్న సీఎం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. సంక్షేమ పథకాలపై ఈరోజు సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 3 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారని... ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.
రామానాయుడిని ఉద్దేశించి జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ మేనిఫెస్టో కేవలం రెండు పేజీలు మాత్రమే ఉంటుందని... 2018 సెప్టెంబర్ 3న చెప్పిన మాటనే మేనిఫెస్టోలో పెట్టామని... వచ్చే జూలై 8న పెన్షన్ ను రూ. 2,250 నుంచి రూ. 2,500కు పెంచుతామని చెప్పారు. పథకాల విషయంలో టీడీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నింటినీ తాము అమలు చేస్తున్నామని చెప్పారు. నిమ్మల రామానాయుడికి సభలో మాట్లాడే అర్హత కూడా లేదని తెలిపారు.
రామానాయుడు డ్రామానాయుడిగా తయారయ్యారని జగన్ విమర్శించారు. సభలో ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని స్పీకర్ ను కోరారు. సభలో అసత్యాలు మాట్లాడేవారిని బ్యాన్ చేయాలని అన్నారు. రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ ను జగన్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, సీఎం ప్రతిపాదించిన మోషన్ ను కమిటీకి రెఫర్ చేస్తున్నట్టు తెలిపారు. సభలో ప్రతి ఒక్కరూ నిజాలే మాట్లాడాలని చెప్పారు.