Interpoll: అజాగ్రత్తగా ఉంటే వరల్డ్ క్రిమినల్ నెట్ వర్క్ చేతికి వ్యాక్సిన్: 194 దేశాలకు ఇంటర్ పోల్ హెచ్చరిక
- వ్యాక్సిన్ ను హైజాక్ చేసే ప్రయత్నంలో నేరగాళ్లు
- నకిలీలను చొప్పించడమే లక్ష్యంగా ప్రయత్నాలు
- 194 దేశాలను అలర్ట్ జారీ చేసిన ఇంటర్ పోల్
ప్రపంచంలోని క్రిమినల్ నెట్ వర్క్ ల కళ్లన్నీ ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పైనే ఉన్నాయని, వారు వ్యాక్సిన్ ను హైజాక్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ప్రపంచ దేశాలను ఇంటర్ పోల్ హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ లో నకిలీలను చొప్పించడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారని ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఇంటర్ పోల్ తెలిపింది. ఈ మేరకు తమకు ఆధారాలు లభించాయని చెబుతూ, 194 సభ్య దేశాలనూ అలర్ట్ చేసింది. ఈ గ్యాంగులు అటు భౌతికంగా, ఇటు ఆన్ లైన్ మాధ్యమంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది.
"ఇంటర్ పోల్ ఆరంజ్ నోటీసును జారీ చేస్తోంది. వ్యాక్సిన్ ను తప్పుదారి పట్టించి, డబ్బు సంపాదించేందుకు క్రిమినల్ గ్యాంగులు యత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ డోస్ ల దొంగతనం, తమ వద్ద వ్యాక్సిన్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వేళ నేరగాళ్ల పట్ల జాగురూకతతో ఉండాల్సిన సమయమిది. నేరస్తులకు, ఆన్ లైన్ మోసగాళ్లకు ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో ఓ అవకాశం లభించింది. దీన్ని అడ్డుకునేందుకు అన్ని దేశాలూ కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఇంటర్ పోల్ తన స్టేట్ మెంట్ లో పేర్కొంది.
ఈ మేరకు కొన్ని సాక్ష్యాలను ప్రదర్శించిన ఇంటర్ పోల్, క్రిమినల్స్ కొన్ని వ్యాపార ప్రకటనలు, తమ వద్ద వ్యాక్సిన్ ఉన్నట్టుగా ప్రముఖ కంపెనీల పేరిట వివిధ పేద దేశాలకు లేఖలు పంపాయని, వాటిని నమ్మవద్దని కూడా కోరింది. ఈ సమయంలో అన్ని దేశాలూ సమష్టిగా పనిచేసి, పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, ఈ విషయంలో ఆరోగ్య నియంత్రణా సంస్థలు, లా అండ్ ఆర్డర్ విభాగాలూ కృషి చేయాలని ఇంటర్ పోల్ సెక్రెటరీ జనరల్ జుర్జెన్ స్టాక్ సూచించారు.