Bandi Sanjay: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది.. టీఆర్ఎస్‌కు చెంపపెట్టు: బండి సంజయ్

bandi sanjay slams trs ec

  • ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు 
  • ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ
  • ఇప్పటికైనా కొంచం సిగ్గు తెచ్చుకోండి
  • ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని యత్నం
  • ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి  

జీహెచ్ఎంసీ బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు వున్నా చెల్లిన ఓటుగానే పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. స్వస్తిక్ కాకుండా ఎటువంటి స్టాంపు వేసినా ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేయగా, దాన్ని హైకోర్టు నిలిపివేసింది. స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని ఆదేశించింది. ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవద్దని చెప్పింది. అంటే ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలని సూచించింది.

దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘ఓటర్ల విశ్వాసాన్ని నిలపెట్టిన కోర్టుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ, ఇప్పటికైనా కొంచం సిగ్గు తెచ్చుకోండి. ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉంది’ అని బండి సంజయ్ అన్నారు.
 
‘ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు అడ్డుకొని న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన మొదటి నైతిక విజయం ఇది. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టీఆర్ఎస్ కు ఇది చెంపపెట్టు’ అని అన్నారు.

‘ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి లేక ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలి. లేకపోతే ప్రజలే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. టీఆర్ఎస్, ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలు అయింది’ అని బండి సంజయ్ చెప్పారు.

‘ప్రతి గంటకు పోలింగ్ శాతంను ప్రకటించిన ఈసీ, సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదు? ఆ సమయంలో 12% నుండి 18% వరకు ఎలా పెరిగింది? దీనిపై హైకోర్టు విచారణ జరపాలి’ అని అన్నారు.


‘కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్నట్టుండి 90% పోలింగ్ పెరిగింది, ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉంది, వాటిమీద కూడా విచారణ జరపాలి. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ, ఎక్కడా ఎన్నికలు జరగలేదు’ అని బండి సంజయ్ ఆరోపించారు.

‘పెన్నుతో టిక్కులు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న ఆకలి, ఆపతి, ఆత్రుత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎన్నికుట్రలు చేసినా బీజేపీ వైపే ప్రజలు ఉన్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలు’ అని బండి సంజయ్ అన్నారు.

  • Loading...

More Telugu News