Team India: టీ20లో సత్తా చాటిన టీమిండియా... 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం

Teamindia defeats Australia in first twenty over match

  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 7 వికెట్లకు 161 పరుగుల స్కోరు
  • లక్ష్యఛేదనలో 150/7 రన్స్ చేసిన ఆసీస్
  • చెరో మూడు వికెట్లు తీసిన చహల్, నటరాజన్

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ను 1-2తో కోల్పోయిన భారత జట్టు టీ20 సిరీస్ ను ఆశావహ దృక్పథంతో ఆరంభించింది. ఇవాళ కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. భారత్ విసిరిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి పరాజయం పాలైంది.

టీమిండియా బౌలర్లలో యజువేంద్ర చహల్ 3, నటరాజన్ 3 వికెట్లతో ఆసీస్ పనిబట్టారు. రవీంద్ర జడేజా గాయపడడంతో అతడి స్థానంలో కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగిన చహల్ బౌలింగ్ చేసి ఆసీస్ ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కెరీర్ లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన తమిళనాడు కుర్రాడు నటరాజన్ అద్భుతమైన స్పెల్ తో అలరించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాడు.

ఇక ఆసీస్ బ్యాటింగ్ చూస్తే ఓపెనర్లు డీఆర్సీ షార్ట్ 34, కెప్టెన్ ఫించ్ 35 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో మోజెస్ హెన్రిక్స్ 30 పరుగులు సాధించాడు. స్మిత్ (12), మ్యాక్స్ వెల్ (2) విఫలమయ్యారు. అంతకుముందు టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (51), రవీంద్ర జడేజా (44), శాంసన్ (23) రాణించారు. హెన్రిక్స్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.

ఈ విజయంతో కోహ్లీ సేన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6న సిడ్నీలో జరగనుంది.

  • Loading...

More Telugu News