Uttam Kumar Reddy: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం... పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- గ్రేటర్ ఎన్నికల్లో 2 డివిజన్లకు పరిమితమైన కాంగ్రెస్
- హైకమాండ్ కు రాజీనామా లేఖ పంపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలంటూ విజ్ఞప్తి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ లో పార్టీ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీకి తన రాజీనామా లేఖను పంపారు. కాగా, ఉత్తమ్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
ఈసారి బల్దియా ఎన్నికల్లో పోటీ అంతా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యే నడిచింది. అభివృద్ధి మంత్రంతో టీఆర్ఎస్, మతపరమైన అంశాలు, భవిష్యత్ పథకాలతో బీజేపీ, స్థానిక బలం ఆధారంగా ఎంఐఎం తమ శక్తిమేర పోరాడాయి. ఈ పోరాటంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. బీజేపీ తన అధినాయకత్వాన్ని సైతం గ్రేటర్ ప్రచార బరిలో దించి మెరుగైన ఫలితాలు అందుకుంది. కాంగ్రెస్ కు ఆ స్థాయిలో ప్రచారం చేసేవారే కరవయ్యారు.