Komatireddy Venkat Reddy: పీసీసీ చీఫ్ రేసులో నేనే ముందున్నా: కోమటిరెడ్డి
- నాకు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తా
- ప్రజల పక్షాన పోరాటం చేస్తాం
- ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి
టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఇప్పటికే పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పీసీసీ పగ్గాలను చేపట్టడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని చెప్పారు. తనకు పీసీసీ చీఫ్ ఇస్తే కాంగ్రెస్ శక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తానని తెలిపారు. ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు భారంగా మారిందని... గ్రేటర్ ఎన్నికల ఫలితాన్ని చూసైనా ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరదసాయం అందని వారందరికీ రూ. 10 వేల వంతున సాయాన్ని అందించాలని అన్నారు. లేనిపక్షంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పారు.